Tuesday, January 12, 2010
సంక్రాంతి లక్ష్మి
భారతదేశంలో జరుపుకొనే ప్రతి పండుగకూ అర్థం, పరమార్థం ఉన్నాయి. ప్రకృతికి, కాలానికి, ప్రజలకు ఆచార సంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో విశిష్ట విషయాలకు ఆలవాలమై ఏర్పడ్డాయి. సంక్రాంతిని భారతదేశంలో వివిధ ప్రాంతాల వారు వివిధ కాలాల్లో జరుపుకొంటున్నా, ముఖ్యంగా తెలుగువారి సంక్రాంతికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. సూర్యగమనానికి సంక్రమణం అని పేరు. సూర్యుడు ప్రతిమాసంలోనూ ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించినప్పుడు మాస సంక్రాంతులేర్పడతాయి. మకరరాశిలోనికి ప్రవేశించినప్పుడు ఏర్పడేదే మకర సంక్రాంతి. ఈ సమయంలో సూర్యుడు ఉత్తరాభిముఖుడై ప్రయాణిస్తాడు. దీన్ని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం పుణ్యప్రదమైనది. స్వర్గద్వారాలు ఉత్తరాయణంలో తెరచి ఉంటాయని చెబుతారు. అందుకే భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యఘడియలకోసమే అంపశయ్యపై వేచి ఉన్నాడు. భారతీయులు కర్మనిష్ఠులని చాటిచెప్పే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పర్వదినాన పితృదేవతలకు తర్పణాలను ఏర్పరుస్తారు. పెద్దలను తలచి వారిని పూజించే పర్వదినం కాబట్టి ఇది 'పెద్దల పండుగ'ని అంటారు. ఈ పర్వదినం ప్రధానంగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే నాలుగు రోజులు జరుపుకొంటారు. భోగి పండుగనాడు పుణ్యనదీజల స్నానం చేయడం, నూతన వస్త్రాలను ధరించడం, లోకం నిండా భోగభాగ్యాలు విలసిల్లాలని కోరుకోవడంతోపాటు భోగి కల్యాణాన్ని నిర్వహిస్తారు. గోదాదేవి 'తిరుప్పావై' వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథునిలో ఐక్యమైన రోజు కూడా ఇదే. విశ్వమానవాళికి ఆదర్శసూత్రాలను పంచిన గోదాకల్యాణమే లోకానికి శాంతికల్యాణం. భోగి రోజున వేసే భోగిమంటలు అభ్యుదయ భావాలకు ప్రతీక. 'పాత'లోంచి కొత్తకు స్వాగతం పలుకుతూ నిత్యనూత్నంగా ఉండేందుకు కరదీపిక. భోగినాటి సాయంత్రం పిల్లలకు పోసే భోగిపళ్ళు, నిండైన హృదయాలతో పెద్దలు చేసే ఆశీర్వచనాలై వారిని దీవిస్తాయి. బొమ్మల కొలువులు పిల్లల్లో సమష్టి జీవనానికి సృజనాత్మకతకు పెద్దపీట వేసి తరతరాల సంస్కృతికి కొత్త చివుళ్ళు తొడుగుతాయి. ప్రకృతి మొత్తం పచ్చని తివాచీ పరచినట్లుండి పల్లెల్లో గాదెలు, ముంగిళ్ళలో గొబ్బెమ్మలు, ఆబాలగోపాలం వేసే చిందులు- భోగిమంటలు జీవితానికి కొత్త పరిమళాన్ని అద్దుతాయి.
సంక్రాంతి నుంచే సూర్యుడు ఉత్తరాభిముఖుడై తేజోవంతుడై లోకానికి కొత్త జవసత్వాలు అందిస్తాడు. సంక్రాంతి నాడు చేసే దానధర్మాలు, కర్మలు, తర్పణాలు, పేరంటాలు మన సంస్కృతిలోని విశిష్టతలకు పరాకాష్ఠలై నిలుస్తాయి. కనుమ రోజు గ్రామాల్లో పాడి పంటలకు మూలస్తంభాలై నిలిచే పశువులను పూజించడం, ఏరువాక సంబరాలు జరుపుకోవడం వంటి కృతజ్ఞతాపూర్వకమైన ఆచారాలున్నాయి. ముక్కనుమ కనుమకు పొడిగింపు. కనుమతోపాటుగా ముక్కనుమనాడూ సంప్రదాయాలను పాటిస్తూ ఎక్కడికీ వెళ్ళకుండా ఉండటం ఒక ప్రత్యేకత. మానవ మనుగడ పూర్తిగా ప్రకృతిపై, పశుపక్ష్యాదులపై ఆధారపడి ఉంది. అవి మన జీవితంలో ఒక భాగం. వాటిపై మమకారాన్ని ప్రదర్శించడం, కృతజ్ఞత చూపడం మన కనీస ధర్మం. అభాగ్యులకు కారుణ్య హస్తాలతో దానాలు చేయడం, ముగ్గుల రూపంలో వేసే బియ్యపు పిండితో అల్పజీవులైన పక్షులకు సైతం ఆహారాన్ని అందించడం, ధనుర్మాసం పేరిట నిష్ఠగా ఉండటం, శాంతికల్యాణంలో పాల్గొని ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం, పెద్దలకు వదిలే తర్పణాల ద్వారా కర్మనిష్ఠ; గంగిరెద్దులు, జంగంవాళ్ళు, బుడబుక్కలవాళ్ళు, హరిదాసుల వంటి వారికి చేసే దానాల ద్వారా కళాపోషణ; కోడిపందాలు, ఎడ్లపందాల ద్వారా పోటీ తత్వం, వివిధ రకాలైన ఆటల ద్వారా క్రీడా తత్వం... ఇలా ఒకటేమిటి... పల్లె పల్లెకూ... గడప గడపకూ... గుండె గుండెకూ... చక్కని శోభను తెచ్చే పర్వదినం సంక్రాంతి. అందుకే సంక్రాంతి ఒక దివ్యకాంతి. సర్వలక్ష్ములను తనలో నింపుకొన్న మహత్తరమైనది సంక్రాంతి లక్ష్మి.
- డాక్టర్ అద్దంకి శ్రీనివాస్
ఆరోగ్య సౌభాగ్యాల గొబ్బియలు
తెలుగువారు పండగలకు, శుభకార్యాలకు పేడతో కళగా ఇల్లలుకుతారు. ఊళ్ళో బాగలేదనుకుంటే - అదే పేడను కల్లాపి చల్లి పురుగూపుట్ర దరి చేరకుండా జాగ్రత్తపడతారు. అలా మన సంస్కృతికి, గోమయానికి విడదీయలేని బంధం ఉంది. గొబ్బియలాడడంలో అంతరార్థం కూడా ఇదేనేమో. పంట ఇల్లు చేరే వేళ, పండగవేళ గొబ్బెమ్మ పాటలు పాడడంలోని పరమార్థమూ ఇదే.
ఇంటి ముంగిళ్లను అలరించే రంగవల్లులు... హరినామ సంకీర్తనలతో చిరుచీకట్లలో దర్శనమిచ్చే హరిదాసులు... అంబపలుకు జగదంబ పలుకు అంటూ డమరుకంతో బుడబుక్కల వాళ్లు... అయ్యవారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు అంటూ బసవన్నతో విన్యాసాలు చేయించే గంగిరెద్దుల వాళ్లు... కొత్తల్లుళ్లు... ముగ్గులుదిద్దే ముద్దుగుమ్మలు... మనోజ్ఞమైన ఈ దృశ్యాలన్నీ కళ్లకు కట్టేది ఒక్క సంక్రాంతి సమయంలోనే.
గొబ్బెమ్మ అంటే...
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు, ఆ గొబ్బిళ్ల మీద ముళ్లగోరింట, గుమ్మడిపూలు... ఇవీ కనిపించే దృశ్యాలు. ముగ్గుల మధ్యన ఆవుపేడతో ముద్దలు చేసి, వాటికి పసుపు కుంకుమలు పెట్టి గుమ్మడి, బంతి, చేమంతి వంటి పూవులను గుచ్చుతారు. వాటినే గొబ్బెమ్మలంటారు. ఆ తర్వాత పిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గొబ్బిపాటలు పాడుతూ నృత్యం చేస్తారు.
ఆచారంలోని అంతరార్థం...
హేమంత రుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం వల్ల సున్నంలోని క్యాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవుపేడతో కల్లాపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది. తామెప్పుడో విన్న లేదా చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం వలన ధారణశక్తి పెరుగుతుంది.
గొబ్బి శబ్దం పుట్టిందిలా...
గొబ్బి శబ్దం గోపి నుండి పుట్టింది. గోపి, గోపిక, గోపియ, గోబియ, గొబ్బియ... గొబ్బిగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలు కృష్ణుని గోపిగా, గొబ్బెమ్మలను గోపికలుగా భావిస్తూ వాటి చుట్టూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడడం మన సంస్కృతిలో భాగం. కొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యునికి, మిగతా గొబ్బెమ్మలు గ్రహాలకూ సంకేతమని చెబుతారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి చివరిరోజున సందె గొబ్బెమ్మను పెట్టి కన్నెపిల్లలందరూ పాటలు పాడతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, తొందరగా పెళ్లవుతుందని ఒక నమ్మకం.
రంగురంగులుగా తీర్చిదిద్దిన రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడమంటే ఆకాశంలోని చుక్కలను ఇంటి ముంగిట పెట్టినట్లేనని, ఖగోళ శాస్త్ర రహస్యాలెన్నింటినో తెలియ చేసేందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని కొందరు చెబుతారు. ఇలా గొబ్బెమ్మల వెనుక అంతరార్థాలెన్నో! ఇలా పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి, వాటిని దండగా గుచ్చి, ఆ పిడకల దాలి (నిప్పుసెగ) మీద పాయసం వండి, భగవంతునికి నివేదిస్తారు.
- డి.వి.ఆర్ భాస్కర్,
ఉదకాన పుట్టావు...
ఉదకాన పుట్టావు నీవు గొబ్బెమ్మ-
ఉదకాన పెరిగావు నీవు గొబ్బెమ్మ
సంధి ద్రాక్షపళ్లు శతకోటి స్నానాలు-
నీ నోము నాకిచ్చి నాకు వరమీయవే గొబ్బెమ్మ
పసుపున పుట్టావు నీవు గొబ్బెమ్మా
పసుపునా పెరిగావు నీవు గొబ్బెమ్మా
సంధి ద్రాక్షపళ్లు శతకోటి స్నానాలు-
నీ నోము నాకిచ్చి నాకు వరమీయవే గొబ్బెమ్మ
కుంకాన పుట్టావు నీవు గొబ్బెమ్మ
గంధాన పుట్టావు నీవు గొబ్బెమ్మ
అక్షింతన పుట్టావు నీవు గొబ్బెమ్మ
పుష్పాన పుట్టావు నీవు గొబ్బెమ్మ
గొబ్బి సుబ్బమ్మ...
గొబ్బి సుబ్బమ్మ సుబ్బానీయవే-
చేమంతి పువ్వంటి చెల్లెలినియ్యవే
తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే-
అరటి పువ్వంటి అన్ననియ్యవే
మల్లె పువ్వంటీ మామానీయవే-
బంతి పువ్వంటి బావానియ్యవే
కుంకుమ పువ్వంటి కూతురునీయవే-
కొబ్బరి పువ్వంటి కొడుకునియ్యవే
అరటి పండంటి అల్లుణ్ణియ్యావే-
గులాబి పువ్వంటి గురువునియ్యావే
మొగలి రేకంటి మొగుణ్నియ్యావే-
మొగలి పువ్వంటి మొగుణ్నియ్యావే-
మొగలి పువ్వంటి మొగుణ్నియ్యావే...
అక్కల్ దుక్కుల్ దున్నారంట...
గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాడే పాట...
గొబ్బియల్లో- గొబ్బియల్లో- అక్కల్ దుక్కుల్ దున్నారంట ఏమి దుక్కుల్ దున్నారంట-
రాజావారి తోటలో జామ దుక్కులు దున్నారంట
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో ॥గొబ్బి॥
విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట
రాజావారి తోటలో జామా విత్తనం వేశారంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో ॥గొబ్బి॥
మొక్కా మొక్కా మొలిచిందంటా- ఏమి మొక్కా మొలిచిందంటా
రాజావారి తోటలో జామా మొక్కా మొలిచిందంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో ॥గొబ్బి॥
ఆకు ఆకు వేసిందంటా - ఏమి ఆకు వేసిందంటా
రాజావారి తోటలో జామా ఆకు వేసిందంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో ॥గొబ్బి॥
కొమ్మా కొమ్మా వేసిందంటా - ఏమి కొమ్మా వేసిందంటా
రాజా వారి తోటలో జామా కొమ్మా వేసిందంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
మొగ్గా మొగ్గా వేసిందంటా- ఏమి మొగ్గా వేసిందంటా
రాజా వారి తోటలో జామా మొగ్గా వేసిందంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
పువ్వూ పువ్వూ పూసిందంటా- ఏమి పువ్వూ పూసిందంటా
రాజా వారి తోటలో జామా పువ్వూ పూసిందంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
పింది పింది వేసిందంటా - ఏమి పింది వేసిందంటా
రాజా వారి తోటలో జామా పింది వేసిందంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
కాయా కాయా కాసిందంటా - ఏమి కాయా కాసిందంటా
రాజా వారి తోటలో జామా కాయా కాసిందంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
పండు పండు పండిందంటా - ఏమి పండు పండిందంటా
రాజావారి తోటలో జామాపండు పండిందంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
దొరలూ దొరలూ వచ్చారంటా - ఏమి దొరలూ వ చ్చారంటా
రాజావారి తోటలో జామా దొరలూ వచ్చారంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
డేరాలు డేరాలే వేశారంటా - ఏమి డేరాలు వేశారంటా
రాజావారి తోటలో జామా డేరాలు వేశారంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
కుర్చీలు కుర్చీలు వేశారంట - ఏమి కుర్చీలు వేశారంటా
రాజా వారి తోటలో జామా కుర్చీలు వేశారంట
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో
టీలు టీలు ఇచ్చారంటా - ఏమి టీ లు ఇచ్చారంటా
రాజావారి తోటలో జామాటీలు ఇచ్చారంటా
అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా- భామరసిరి గొబ్బిళ్లో ॥గొబ్బి॥
ఓ చందమామ...
చందమామ చందమామ ఓ చందమామ
చందమామ కూతురు నీలగిరి కన్య
నీలగిరి కన్నెకు నిత్యమల్లె తోట
నిత్యమల్లె తోటకు బుడుగు బుడుగు చెంబు
బుడుగు బుడుగు చెంబుకు వచ్చాయి పూలు
ఆపూలు, ఈ పూలు పళ్లెంలో వేసి వెళ్లిందమ్మా. వెళ్లింది చిన్న తిరుపతి కొండకు.
చిన్న తిరుపతి వెంకన్న కొనవయ్యా ఈ పూలు. కొంటేనే ఓ బాల ఈ పూలు నేను
పచ్చ చామంతి పూలు. పాతిక వేలు స్వామి. ఎర్ర చామంతి పూలు యాభై వేలు స్వామీ
తెల్ల చామంతి పూలు తొంభై వేలు స్వామీ- కొనలేను ఈ పూలు నేను.
ఆ పూలు ఈ పూలు పళ్లెంలో పోసి-
వెళ్లిందమ్మా వెళ్లింది పెద్ద తిరుపతి కొండకు
పెద్ద తిరుపతి వెంకన్న కొనవయ్యా ఈ పూలు. కొంటానే ఓ బాలా ఈ పూలు నేను.
॥మళ్లీ తెల్ల, పచ్చ, ఎర్ర ,చామంతి పూలతో పాట పాడాలి.॥
పాటల సహకారం: ఎం.వి.ఎస్.ఎస్. మూర్తి, భీమవరం
మూగచక్రాలు
చక్రం... మానవ జీవితానికి సంకేతం. బతుకుబండిని నడిపే మనిషి... కుటుంబం కోసం తనెంత కష్టపడుతున్నదీ చెప్పుకుంటాడు. కానీ మనిషికోసం పని చేసే మూగజీవాలు తమ కష్టాన్ని వ్యక్తం చెయ్యవు. అదే వాటి గొప్పదనం. అందుకే అవి మనిషి జీవితానికి రథచక్రాలయ్యాయి. పశుగణం ఇంతటి ఉన్నతమైనది కాబట్టే ప్రత్యేకంగా వీటికోసం పండుగలే పుట్టాయి. వీటిలో ముఖ్యమైంది కనుమ. కనుమ అంటే ఒడ్డు అనే అర్థం ఉంది. "దక్షిణాయనంలో అందర్నీ ఒక ఒడ్డు కాశాను.. ఉత్తరాయణం వస్తోంది. ఇక మరింత జాగ్రత్తగా నడవండి' అని పరమార్థం. కనుమ అంటే బండిచక్రం అని కూడా మరొక అర్థం. మనిషిని సరైనదారిలో నడిపించే మూగ చక్రాల పండుగ ఇది.
'ఉత్తరాయణ పుణ్యకాలం' - అంటే - సంక్రాంతి - అంటే - మకర సంక్రాంతి మరురోజు 'కనుము పండుగ'! 'కనుము' అంటే పశువు అని అర్థం. ఇదేమిటి? పండుగ అనేది మనుషులకుంటుంది కానీ పశువులకా? అనుకోకూడదు. వేదమంత్రం చెప్తోంది - శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే - అని. రెండు కాళ్ళున్న జీవులమైన మా నరజాతికీ పక్షిజాతికీ మాత్రమే కాక, నాలుగు కాళ్ళున్న పశువులకి కూడా శుభం కలుగుగాక! అని దీనర్థం.
ఒక తండ్రికి ఐదుగురు సంతానమున్నారనుకుందాం! వాళ్ళలో ఒక్కరు మాత్రమే సుఖసంతోషాలతో ఉంటే, ఆ తండ్రి ఆ పిల్లవాణ్ణి చూసుకుంటూ ఆనందపడడు. మిగిలిన నలుగురి గురించీ దుఃస్తూ ఉంటాడు. అలాగే ఏ పరమేశ్వరునికి పశువులు, పక్షులు క్రిములు, కీటకాలు... ఇలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులూ సంతానమో అవన్నీ ఆనందంతో ఉండాలనేదే ఆ పరమేశ్వరుని అభిప్రాయం.
అందుకే పండుగ అనేది మన ఒక్కరికే కాదు. ఇతర ప్రాణులకీ ఉంటుంది. ఆ విషయం మరింతగా వివరించడం ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి, నాలుగు కాళ్ళుండే జంతువులకి పండుగ అయిన కనుము గురించి మాత్రమే చెప్పుకుందాం.
ఈ రోజు గోవులనీ, ఎద్దులనీ చక్కగా జలాశయాలకి తీసుకెళ్లి ఎండుగడ్డితో వాటిని యాజమానే తోముతూ ఉంటే - వాటి ముఖాల్లో కన్పించే ఆనందం సామాన్యంగా ఉండదట. 'మా యజమానికి ఏదో కొంత ధాన్యాన్ని పండించి తెస్తే ఇంతగా మాకు సేవ చేస్తున్నాడా?' అని ఆనందిస్తాయట. ఇది అసత్యం కాదు. యజమాని కంఠస్వరం వింటూనే 'అంబా' అని అరిచే ఆవులూ, పెద్దగా రంకె వేసే ఎద్దులు ఉంటాయి. పాడికి సంకేతం ఆవు అయితే, పంటకి సంకేతం ఎద్దు. పాడిపంటలకు సంకేతం ఆవూఎద్దూ కాబట్టే వీటిని ఆవు, ఆబోతు (ఆవుకి పోతు - ఆవుకి భర్త) లన్నారు. సంస్కృతంలో 'గో' అనే శబ్దం ఉంది. దానికి పుంలింగం 'ఎద్దు' అయితే, స్త్రీలింగం 'ఆవు' అవుతుందని అర్థం.
ఈ ఆవు తన సంతానానికి పాలు ఇచ్చి రక్షిస్తే, ఎద్దు గాదెల్ని నింపి రక్షించింది కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా వీటిని కడిగి కొమ్ములకు పసుపు పూసి రెండు కొమ్ములకీ మధ్యగా పూలచెండును పెట్టి ఎద్దు మూపురానికి పసుపు పూసి బొట్టు పెట్టి పూజిస్తారు కర్షకులు. ఆవులో సర్వదేవతలూ ఉన్నారు. దేవతలకు ఆహారమైన అమృతంతో పాటు యజ్ఞంలో అతి పవిత్రంగా స్వీకరించబడే సోమరసాన్ని వీటిలో దాచుకుంటారట దేవతలు. అంతేకాదు, ఆవు తన దూడని పన్నెండు నెలల కాలం పాటు గర్భంలో మోసి కంటుంది. ఆవు ఈనుతున్న సందర్భంలో ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ ఫలితం ఉంటుంది. దేన్నయినా దొంగతనమనవచ్చు కానీ, ఆవు గడ్డి కోసం గడ్డి మేటు నుండి గడ్డిని తీసుకుంటే దాన్ని 'చౌర్యం' అనరాదంది భారతం.
ఆవు తోక మీదుగా పడ్డ జలాన్ని తలపై చల్లుకుంటే పాపనాశనం. అలాంటి గోవుని ప్రేమించిన దిలీపుడు వంశకర్త అయిన (ఇక సంతానమంటూ లేదనే చింత రానీయని పుత్ర సంతానం) రఘుమహారాజును పుత్రునిగా కన్నాడు. ఇతని పేరు మీదే అది రఘువంశమైతే ఆ వంశంలో పుట్టడం చేతనే రాముడు 'రాఘవు'డయ్యాడు. ఇలాంటి ఆవు రెండు కొమ్ముల మధ్య ప్రదేశాన్ని చూస్తూ పరమేశ్వర స్తుతి చేస్తే కోరిన కోరిక నెరవేరుతుందట. ఆవు అంతటి గొప్పదైతే ఎద్దు మూపురంలో శంకరుడుంటాడు. అందుకే అది శివలింగాకృతిలో ఉంటుంది. 'కకుత్' అంటే మూపురమని అర్థం. 'స్థ' అంటే 'దానిలో ఉన్నవాడు' అని అర్థం. శివుడు ఆ 'కకుత్‌స్థు'డయ్యాడు కాబట్టే ఆ పూజని చేసినవాళ్ళను 'కాకుత్‌స్థు'లంటారు.
గ్రామంలో ఆవులు, ఎద్దులు ఇలా నడుముకు చక్కని తాళ్ళతో పసుపు కుంకుమలతో మెడలో గంటలతో కాళ్ళకు గజ్జెలతో ఊరేగింపుగా వెళ్లడం ఎంత సుందరంగా నయన మనోహరంగా ఉంటుందో కళ్ళలో ఊహించుకోవచ్చు. ఇక కనుమునాడు చేయవలసింది పోయిన పితృదేవతలను తలుచుకుని శ్రాద్ధాన్ని నిర్వహించడం. శ్రద్ధతో పెట్టే దాన్నీ, పెట్టవలసిన దాన్నీ శ్రాద్ధమన్నారు కాబట్టి కార్యాలయ సమయాన్ని గమనిస్తూ చేతులు దులుపుకుంటే అది శ్రాద్ధం కాబోదు. 'కనుమునాడు కాకైనా కదలదు' అనే సామెత మనకుంది. గారెలు శ్రాద్ధకాలంలో పెట్టబడే పిండివంట. పొద్దున్న లేస్తూనే తిండి ఎక్కడ దొరుకుతుందా? అని ఆలోచించే కాకి కూడా, ఈ రోజు శ్రాద్ధ దినమైన కనుము కాబట్టి, మనం ఎక్కడికీ కదలనక్కరలేదు - ఉన్నచోట కూడా (ఊరంతా గారెలు వండుతారు కాబట్టి) తిండి లభిస్తుందని ఆనందిస్తూ ఉండిపోతుందట.
ఆ కాకికి కూడా ఇష్టమైన చిన్న గారెముక్కని - అది కూడా తన పితృదేవతలను తలుచుకుని పెట్ట(లే)ని పక్షంలో, ఆ పితృదేవతల రక్తమాంసాలతో ఉన్న శరీరాన్ని - వాళ్ళ బుద్ధినీ మనం కలిగి ఉండడం ద్వారా - వాళ్ళ ఆస్తిపాస్తుల్ని అనుభవించడం కృతఘ్నత కిందికే వస్తుంది. కాబట్టి ఈ రోజున శ్రాద్ధాన్ని నిర్వహించవలసిందే. ఇక స్త్రీలందరూ ఈ రోజున పెట్టేది రథం ముగ్గు. ఆ రథం చివర ఒక తాడు ఆకారంలో గీతని పక్కింటి రథానికి తగిలిస్తారు. అలా అలా అన్ని రథం ముగ్గులకీ ఉన్న తాడు శ్మశానం వరకు వెళ్తుంది. 'ఓ వ్యక్తీ! ఎన్నో అలంకరణలతో ఎంతోమంది లాగుతూ నిన్ను గౌరవించి ఎంత దూరమో ఒకప్పుడు తీసుకెళ్ళినా నీ చివరి ప్రయాణం మాత్రం (నీ శరీరమనే రథానికి) శ్మశానమే సుమా!' అని తెలియజేస్తుంది ఈ ముగ్గు. కాబట్టి జీవించిన కొంతకాలమైనా పదిమందీ నీ గురించి మంచిగా అనుకునేలా జీవించవలసిందని ఇక్కడి ఉపదేశం.
- డా॥ మైలవరపు శ్రీనివాసరావు
అమ్మ... ఆవు...
పంటచేలతోనూ, ధాన్యరాశులతోనూ, పశుగణాలతోనూ కనుమకున్న చెలిమి... గొప్ప కలిమి. వ్యవసాయాన్ని నిండారా పండించి జనం ఆకలి తీర్చేందుకు సాయపడే ఎద్దు... స్వచ్ఛమైన పాలతో పిల్లలకు మామంచి అమ్మాయి వెనుబలమిచ్చే ఆవు... చద్దన్నం చలవదాసులకు చేదోడువాదోడయ్యే గేదె... కళ్లంలో బళ్లు లాగే ఎనుబోతు... కనుమ కథానాయికానాయకులు. వీటిని కొలవడమే కనుమ రోజు విశేషం. ఉదయమే ఈ మూగజీవుల ఒంటికి నూనె పట్టించడం పెద్ద పని. గంగడోలు సవరిస్తుంటే ఆవుకు మాచెడ్డ తమకం. వెన్ను రాస్తుంటే వెన్నే రాసినట్టు భావించే గేదెకు ప్రపంచంతో సంబంధం ఉండదు. చమురుసేవలయ్యాక మెల్లగా నీటి ఊటల్లో దించి గడ్డీ గాదరా వేసి ఒళ్లంతా తోముతుంటే వీటికి ముదము. అదో అరివీరభయంకర వ్యాయామం.
గట్టుకు చేరే పశువులకి పసుపుకుంకుమలు పూయడం, మెళ్లో పూలమాలలేయడం, చిట్టు, తవుడు పెట్టి విందు చేయడం ఇంట్లో అమ్మల, అక్కల విహిత కర్తవ్యం. ఇంటిల్లిపాదీ ప్రదక్షణాలుచేసి, ప్రణమిల్లి వచ్చే ఏడాది వ్యవసాయం వీటి సాయంతోనే జరగాలని మొక్కులెట్టుకుంటుంటారు. ప్రతిరోజూ గేదెల మూపున కూర్చొని బీళ్లలో ఊరేగే కుర్ర నాగన్నలూ కనుమ రోజు భక్తిప్రపత్తులతో వీటిని సేవిస్తారు. ఇక 'విశ్వరూపం సర్వారూపం గోరూపం' అని వేదం స్పష్టంగా చెప్పింది. యుద్ధభూమిలో సహస్రబాహువులతో శ్రీకృష్ణపరమాత్మ చూపిన విశ్వరూపానికి పరవశుడైపోతాడు అర్జునుడు. ఆ ఆవేశంలో స్తోత్రం చేస్తాడు. పుణ్యాత్ముడవుతాడు. మరి విశ్వరూపసందర్శన అందరికీ సాధ్యం కాదు కదా. అయినా బెంగ పడిపోనక్కరలేదు, ఉదయాన్నే గోవును చూసి నమస్కరిస్తే చాలు.
- చింతకింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment