Sunday, June 7, 2009

ఏరువాక పున్నమి

సామాజిక స్వరూపాన్ని నిర్ణయించేది ఆ ప్రజలకు భగవంతునిపై ఉన్న దృక్పథం. ఆది మానవుడికి దేవుడు ప్రాకృతికశక్తి. వ్యవసాయ సంస్కృతి దాకా అదే సాగుతూ వచ్చింది. గణజీవితంలోని ప్రాకృతిక పూజలన్నీ ఆర్యుల చేతిలో సంస్కృతీకరణం చెందుతూ వచ్చాయి.
రైతులు తమకు ఆహారాన్ని ఇచ్చే పంట పొలంలోను, తమతో పాటు క్షేత్రంలో శ్రమించే పశువుల్లోను, వ్యవసాయ ఉపకరణాల్లోను దైవాన్ని సంభావించారు. ఆంధ్రదేశంలో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను కర్షకులు ఏరువాక పున్నమిగా జరుపుకోవడంలో ఈ దృష్టి గోచరిస్తుంది. సేద్యం భారతదేశంలో ప్రధాన జీవనాధారం. దేశ సౌభాగ్యంలో కర్షకులు జరుపుకొనే ఈ ఉత్సవం జనజీవనంలో ఏరువాక పున్నమి గా ప్రాచుర్యం వహించినా, ఇది వైదికోత్సవం కాదు. కొందరు పండితులు దీన్ని కృషి పౌర్ణమిగా పేర్కొన్నారు.

వర్షరుతువు ఆరంభంకాగానే కృషీవలురు క్షేత్రపాలుని సంబోధిస్తూ మంత్రాలు చదువుతుండేవారని రుగ్వేదం చెబుతుంది.

జైమిని న్యాయమాలలో ఉద్‌వృషభయజ్ఞం పేర్కొన్నారు. ఉత్తర భారతంలో ఆంధ్రుల ఏరువాక పండుగలా ఉద్‌వృషభయజ్ఞం చేసే సంప్రదాయం ఉండేదని, ఆ రోజు ఎడ్లను పూజించి పరుగెత్తించేవారని తెలుస్తోంది.

విష్ణుపురాణంలో సీతాయజ్ఞం ప్రస్తావన ఉంది. సీత అనే మాటకు నాగేటి చాలు అని అర్థం.

బ్రాహ్మణులకు మంత్రజపమే యజ్ఞం, కర్షకులు సీతాయజ్ఞం చేస్తారు, గోపాలురు గిరి యజ్ఞపరులు అని శ్రీకృష్ణుడు గోప వృద్ధునితో చెప్పినట్లు భాగవత పురాణం పేర్కొంటోంది. బౌద్ధ జాతక కథల్లోని వప్ప మంగలదివస ఏరువాక పండగను పోలినదే. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్ష రుతువు ఆరంభం కాగానే కర్షకులకు లాంఛనంగా ఒక బంగారు నాగలిని అందజేసేవాడని లలితవిస్తరం చెబుతోంది. హాలుని గాథాసప్తశతిలో ఏరువాక పున్నమి ప్రస్తావన ఉంది. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. ఎడ్లకు పొంగలి పెడతారు. సాయంకాలం గ్రామంలోని రైతులంతా మంగళవాద్యాలతో ఊరేగింపుగా పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. ఊరి వాకిట గోగునారతో చేసిన తోరణం కడతారు. దాన్ని చెర్నాకోలలతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు. ఇది పశువులకు మేలు చేస్తుందని నమ్మకం. ఐరోపా దేశాల్లోని మేపోవ్ ఇటువంటి పండుగే.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు

No comments:

Post a Comment