Sunday, June 7, 2009

మృగశిర కార్తె

పరమాత్ముడు తాను సృజించిన జీవరాశుల బాగోగుల గురించే సదా కర్తవ్య నిమగ్నుడై ఉంటాడు. విశ్వగమన క్రియలకు పరమాత్ముడే అధినేత. నక్షత్రాలు, గ్రహాలు రాశులతో కూడిన విశ్వాంతరాళం ఆయన కనుసన్నల్లోనే పరిభ్రమిస్తూ జీవరాశులకు అనుకూలమైన రుతువులకు కారణమవుతోంది. చైత్రం నుంచి ఆషాఢం వరకు వేసవి, శ్రావణం నుంచి కార్తీకం వరకు వర్షకాలం, మార్గశిరం నుంచి ఫాల్గుణ మాసం వరకు శీతకాలం ఏర్పడుతూ ప్రపంచంలోని జీవులకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు పరమాత్ముడు కల్పిస్తూనే ఉన్నాడు.
తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు. అశ్వినితో ప్రారంభమై రేవతీ కార్తెతో ముగిసే కార్తులు మనకు ఇరవై ఏడు ఉన్నాయి. వర్షకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె పూనిననాడు ఆకాశంలో మృగం తలరూపంలో మూడు నక్షత్రాలు ఒక ఆకారంగా ఏర్పడటం కుతూహలం కలిగిస్తుంది. తొలకరితో ప్రారంభమయ్యే వర్షకాలంలో పొలం పనులు నిర్వహించుకోవడానికి అవసరమయ్యే పశు(మృగ) సంపదను సమాయత్తం చేసుకోవడానికి- ఆకాశంలో మృగశిరస్సు రూపంలో దైవం సంకేతాన్ని అందిస్తాడంటారు. కాలానికి అతీతుడైన పరమాత్మ మాస, తిథి, కార్తె, దిన నక్షత్ర గమనాలను నిర్దేశిస్తూ, జీవులకు అవసరమైన ఆహార ఉత్పత్తులకు, ఇతర దైనందిన వ్యాపకాలకూ మార్గదర్శకత్వం వహించడం వూహకందని అలౌకిక వ్యవహారమే!

వర్షకాలంలో ఎడతెరిపి లేని వానలవల్ల మనిషికి కొన్ని రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. నేటికీ పల్లెప్రాంతాల్లో నాన్నమ్మలు, అమ్మమ్మలూ పిల్లలకు ఇంగువ బెల్లం కలిపి మృగశిర కార్తె పూనిన రోజు తినిపించడం ఆచారంగా కొన్ని ప్రాంతాల్లో గమనించవచ్చు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షకాలంలో సోకే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుంది. వర్షకాలంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిరకార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే పూర్వకాలంనాటి వైద్యుడు గ్రంథస్థం చేశాడు.

పూర్వం వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. అందుకే కార్తెలన్నింటిలోనూ మృగశిరకు చాలా ప్రాముఖ్యం ఉంది. అటు పరమాత్మకూ, ఇటు ధరణిపైని లౌకిక వ్యవహారాలకు మృగశిర కార్తె అనుసంధానంగా ఉంటుందన్నది పెద్దలమాట. తొలకరి జల్లుల కారణంగా భూమిపైనుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నింటికీ ఆనందం కలిగిస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్షపు జల్లుల అనంతరం ధరణినుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని అంటాడు. మృగశిర కార్తె, ఆరుద్ర కార్తెల మధ్య వచ్చే యోగినీ ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, కుమారషష్ఠి, వైవస్వత సప్తమి అత్యంత పర్వదినాలు. ఇంటిబయట వరుణదేవుడు వర్షపు జల్లులు కురిపిస్తూ చల్లని గాలులతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారిస్తే మనస్సు కూడా దైవధ్యానానికి ఆత్రుత పడుతుంది. అందుకే వర్షరుతు ప్రారంభాన్ని సూచించే మృగశిర కార్తె నగరవాసులకూ, పల్లెజనాలకూ పర్వదినమే.
- అప్పరుసు రమాకాంతరావు

No comments:

Post a Comment