రేపు కార్తీక పౌర్ణమి. సాయం సమయంలో ఆరుబయట నిలబడి పైకి చూస్తే సజ్జనుడి హృదయంలాగా నిర్మలంగా ఉన్న ఆకాశం కనిపిస్తుంది. పాలసముద్రంలో విహరిస్తున్న రాజహంస లాంటి నిండుచంద్రుడు కనిపిస్తాడు. సంవత్సరంలోని మిగిలిన పదకొండు నెలల వెన్నెల ఈనాటి శరత్కాలపు వెన్నెలకు సాటిరాదు. ఇదే కార్తీక పౌర్ణమి ప్రత్యేకత.
కార్తీకంతో సమానమైన మాసమూ, వేదంతో సమానమైన శాస్త్రమూ లేవని రుషివచనం. ఈ మాస మహాత్మ్యాన్ని స్కాంద పురాణమూ, పద్మపురాణమూ వివరంగా తెలిపాయి.
కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. అందువల్లనే మనం ఈ మాసంలో కేవలం శివుడిని మాత్రమే కాకుండా కార్తీక దామోదరుడు అనే పేరుతో విష్ణుమూర్తిని కూడా పూజిస్తున్నాం.
కార్తీక మాసంలో గోష్పాదమంత చిన్న నీటిగుంటలో కూడా విష్ణుమూర్తి నివసిస్తాడంటే ఇక బావుల సంగతీ, తటాకాలు, నదీనదాల సంగతీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనుక ఈ నెల రోజులూ తెల్లవారు జామున- సూర్యుడు తులాలగ్నంలో ఉన్న సమయంలో కార్తీక స్నానం చేసినవారికి గంగాస్నానం చేసిన పుణ్యం లభిస్తుందంటారు.
కార్తీక మాసం చలిరోజులు. కనుక బీదలకు వస్త్రదానం చేస్తే మంచిది. అన్నదానం, ముత్తయిదువలకు ఫలప్రదానం చేయటం, ఆవునేతితో దీపారాధన చేయటం, దేవాలయాల్లో ధ్వజస్తంభాలకు వేలాడదీసిన ఆకాశదీపాలకు నమస్కరించటం, వన భోజనాలు, ఉపవాసాలు- ఇవన్నీ పుణ్యకార్యాలే!
కార్తీక పౌర్ణమి నాడు ముత్తయిదువలు నోచుకొనే నోములు రెండు ఉన్నాయి. ఒకటి: కార్తీక చలిమిళ్ల నోము. పూర్వం ఒక పండితుడి కూతురు, ఒక రాజుగారి కూతురు ఈ నోమును అశ్రద్ధతో నోచి, కుటుంబ కష్టాలకు కారకులైనారు. తరవాత పశ్చాత్తాపాన్ని పొంది, భక్తిశ్రద్ధలతో ఇదే నోము నోచుకొని, సకల సౌభాగ్యాలనూ అనుభవించారు. ఈ నోమును నోచుకొనేవారు అయిదు మానికల (పది కిలోల) బియ్యంతో చలిమిడి చేసి, మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువలకు, ఆపై సంవత్సరం పదిమందికి, తరవాతి సంవత్సరం పదిహేను మందికి వాయనాలనిస్తారు. ఇదే ఈ నోముకు ఉద్యాపన.
రెండోది, కృత్తికాదీపాల నోము. కార్తీక పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం వచ్చిన సంవత్సరం ఈ నోమును ప్రారంభిస్తారు. ఆ రోజు శివాలయంలో నూటఇరవై దీపాలను వెలిగిస్తారు. గణపతి పూజ, శివాభిషేకం చేయించి పురోహితుడికి స్వయంపాకం కోసం ఒక మానెడు సోలెడు- రెండున్నర కిలోల బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, కూరగాయలు మొదలైన భోజన పదార్థాలను ఇస్తారు. మర్నాడు- బహుళ పాడ్యమినాడు పదిమంది పండితులకు భోజనం పెడతారు. తరవాతి సంవత్సరం రెండువందలనలభై దీపాలు, ఆ పై సంవత్సరం మూడువందలఅరవై దీపాలను శివాలయంలోనే వెలిగించి ఈ నోమును నోచుకోవాలి. దీనివలన శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ వచనం.
కార్తీక పౌర్ణమినాడు చేయవలసిన విధి మరొకటి ఉన్నది. ఉదయం ఉసిరిక చెట్టు కింద తులసీ ధాత్రీ సమేతుడైన కార్తీక దామోదరుడిని పూజిస్తారు. మధ్యాహ్నం బంధుమిత్రాదులతో కలిసి వనభోజనాలు చేస్తారు. సాయంకాలం తులసికోటకు పూజచేసి స్కాంద పురాణంలో ఉన్న తత్త్వనిష్ఠోపాఖ్యానాన్ని, శత్రుజిత్తు చరిత్రను, దేవదత్తోపాఖ్యానాన్ని, మందరోపాఖ్యానాన్ని, అంబరీషోపాఖ్యానాన్ని పారాయణం చేస్తారు.
జ్యోతిషశాస్త్ర రీత్యా చంద్రుడు మనః కారకుడు; పౌర్ణమీ తిథికి అధిపతి. చంద్రుడికి ప్రాధాన్యం కలిగిన ఈ కార్తీక పౌర్ణమినాడు ఈ కార్యక్రమాలను నిర్వహించినవారికి మానసికమైన ప్రశాంతత, ఆనందమూ లభిస్తాయంటారు.
- డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
Wednesday, November 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment