మూడు నక్షత్రాల సమాహారం మృగశిర. వాటికి ప్రత్యేకమైన పేర్లు లేవు. ఆ మూడింటినీ కలిపి ఇల్వలా నక్షత్రాలు అంటారు. లేడితల లాగ మూడు కోణాలతో ఉంటుందీ నక్షత్రం. అందుకే ఈ నక్షత్రానికీ పేరు. చంద్రుడు పున్నమినాడు మృగశిర నక్షత్రంతో కూడి ఉన్న మాసం కాబట్టి ఇది- మార్గశిర (శీర్ష) మాసం. తాను మాసాలలో మార్గశిరాన్ని అని గీతలో భగవానుడు స్వయంగా చెప్పాడు. అందువలన ఇదెంతో పవిత్రమైన మాసం.
వేదకాలంలో అయనాంశం (సంవత్సరారంభం) ఈ మాసంతోనే అయ్యేది. కనుకనే ఈ మాసానికి అగ్రహాయణిక అనేది పురాణనామం. ఇది హేమంత రుతువులో తొలిమాసం. చల్లదనం (చలి) ఈ మాసం ప్రత్యేకత. మార్గశిర మాసంలో చలి మంటల్లో పడినాపోదనే నానుడి ఉంది. అయినా మంచు కురుస్తూ ఏర్పడిన ఆ చల్లదనం అపరాలులాంటి పంటలకు ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. పశు పక్ష్యాదులకు, ఇతర ప్రాణులకు మోదం కలిగించే కాలమిది. అందువలన వాటి నుంచి వచ్చే ఉత్పత్తులూ సమృద్ధిగా ఉంటాయి. ప్రాణులన్నీ దృఢతరంగా, బలవర్ధకంగా ఎదగడానికి తగిన పరిస్థితులు ఈ మాస వాతావరణంలో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ మాసం లక్ష్మీనారాయణులిద్దరికీ ప్రీతికరమైనదే. విష్ణువు అనుగ్రహం కలగాలంటే ఈ మాసమంతా బ్రహ్మీ ముహూర్తకాలంలో మేల్కోవాలంటారు. తులసి మొక్క మొదలులో ఉన్న మట్టిని సేకరించి నారాయణ నామస్మరణ చేస్తూ ఒంటికి పట్టించుకోవాలి. ఆపైన శిరస్నానం చేయడం పుణ్యప్రదమని పురాణ వచనం. స్నానాంతరం తులసి దళాలతో విష్ణువును పూజించడం సకలైశ్వర్యకరమని ఎందరో నమ్ముతారు. తులసిలోని సుగుణాలు, ఔషధతత్వాలు శరీరానికి చేరాలనేది అంతర్గత ఆరోగ్య భావన.
ఈ మాసంలో అతి ముఖ్యమైనది లక్ష్మి (గురు)వారం నోము. ఈ మాసంలో వచ్చే అన్ని లక్ష్మివారాల్లోను లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన కోడలి చేత తొలి ఏడాది పున్నమి ముందు వచ్చేవారం తప్పక ఈనోము చేయిస్తారు. ఆ దంపతులు, ఆ ఇల్లు అష్త్టెశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకం. ముఖ్యంగా ఈ ఆచారం ప్రాచీన కళింగ ప్రాంతమైన దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో చేస్తారు. అత్యవసరమైనాసరే ఈరోజు డబ్బును ఖర్చుచేయరు. ఈ నియమాన్ని చాలా కుటుంబాలు కచ్చితంగా పాటిస్తాయి. ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహించి తమను విడిచిపెట్టకుండా ఉంటుందని నమ్మకం.
శుక్లపక్ష పాడ్యమి నాడు గంగానదీ (కుదరకపోతే గంగను స్మరిస్తూ) స్నానం చేస్తారు. ఇలా చేస్తే కోటి సూర్యగ్రహణాల సమయంలో స్నానం చేసిన ఫలితంగా చెబుతారు. శుక్లపంచమి నాగపంచమిగా దక్షిణాది వారు నాగపూజ చేస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రావణశుద్ధ, భాద్రపద బహుళ పంచమి రోజులు ఈ పేరుతో నాగపూజకు ఉద్దేశించినా దక్షిణాదిన ఈరోజున చేస్తారు.
శుక్లషష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. తారకాసురుని సంహారం కోసం జన్మించాడు కుమారస్వామి. ఇతడు యోగసాధన చేసి సుబ్రహ్మణ్యతత్వాన్ని తెలుసుకున్నాడు (మూలాధారం నుంచి సహస్రారం వరకు సర్పరూపంలో వ్యాపించి ఉండే శక్తే సుబ్రహ్మణ్యతత్వం). అందువలన కుమారస్వామిని బ్రహ్మచారిగాను, సర్పరూపంగాను పూజించేది ఇది. ఈ పూజ వలన పిల్లలకు బుద్ధి వికసిస్తుందంటారు.
శుక్లపక్ష అష్టమి కాలభైరవాష్టమి. కాశీ నగరానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. కాశీకి వెళ్ళినవారు ముందుగా ఇతడి దర్శనం చేసుకోవాలి. ఆ తరవాతే విశ్వేశ్వరుని దర్శనం. ఇది పరమశివుని నియమం. పరమశివుని కోసం ఎన్నో అగచాట్లు పడ్డ ఇతడిని జన్మదినంనాడు పూజిస్తే కాశీక్షేత్ర దర్శన పుణ్యం కలుగుతుందంటారు.
శుక్లపక్ష ఏకాదశి మోక్షదా ఏకాదశి. తల్లిదండ్రులు గతించిన కుమారులు ఈరోజున ఉపవాసం ఉండి విష్ణ్వాలయదర్శనం చేసుకుంటే, పితృదేవతలు విష్ణుసాయుజ్యం పొందుతారని చెబుతారు. మోహావృతమైన అర్జునునికి యథార్థాన్ని, ప్రపంచానికి తత్వోపదేశాన్ని చేసినది భగవద్గీత. ఈరోజే భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసిన రోజు. అందువల్ల గీతాజయంతిగా ప్రసిద్ధం.
బ్రహ్మ విష్ణు శివాత్మల తేజస్వరూపం దత్తాత్రేయుడి అవతారం. ఇతడు విశ్వగురువు. స్మరించడంతోనే భక్తుల్ని మోక్షమార్గంలో నడిపిస్తాడు. ఇతనికి స్మర్తుగామి అనిపేరు. ఈయన అవతారదినం ఈమాస పూర్ణిమ. ఈరోజున ఇతడిని పూజించిన వారికి విద్యాబుద్ధులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
సౌరమాన గణన ప్రకారం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే రోజు ధనస్సంక్రమణం. అది ఈమాసంలోనే వస్తుంది. ఈరోజు నుంచి మకర సంక్రమణం వరకు సాగే మాసానికి 'ధనుర్మాసం' అనిపేరు. విష్ణ్వాలయాల్లో ధనుర్మాసానికీ ప్రత్యేకత ఉంది. విశేషమైన పూజలు, ఉత్సవాలు చేస్తారు. ఇవికాక విశ్వకర్మ జయంతి, బతుకమ్మ పండుగ ఈ మాసంలోనే వస్తాయి.
- అయ్యగారి శ్రీనివాసరావు
Wednesday, November 18, 2009
కార్తీక పౌర్ణమి
రేపు కార్తీక పౌర్ణమి. సాయం సమయంలో ఆరుబయట నిలబడి పైకి చూస్తే సజ్జనుడి హృదయంలాగా నిర్మలంగా ఉన్న ఆకాశం కనిపిస్తుంది. పాలసముద్రంలో విహరిస్తున్న రాజహంస లాంటి నిండుచంద్రుడు కనిపిస్తాడు. సంవత్సరంలోని మిగిలిన పదకొండు నెలల వెన్నెల ఈనాటి శరత్కాలపు వెన్నెలకు సాటిరాదు. ఇదే కార్తీక పౌర్ణమి ప్రత్యేకత.
కార్తీకంతో సమానమైన మాసమూ, వేదంతో సమానమైన శాస్త్రమూ లేవని రుషివచనం. ఈ మాస మహాత్మ్యాన్ని స్కాంద పురాణమూ, పద్మపురాణమూ వివరంగా తెలిపాయి.
కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. అందువల్లనే మనం ఈ మాసంలో కేవలం శివుడిని మాత్రమే కాకుండా కార్తీక దామోదరుడు అనే పేరుతో విష్ణుమూర్తిని కూడా పూజిస్తున్నాం.
కార్తీక మాసంలో గోష్పాదమంత చిన్న నీటిగుంటలో కూడా విష్ణుమూర్తి నివసిస్తాడంటే ఇక బావుల సంగతీ, తటాకాలు, నదీనదాల సంగతీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనుక ఈ నెల రోజులూ తెల్లవారు జామున- సూర్యుడు తులాలగ్నంలో ఉన్న సమయంలో కార్తీక స్నానం చేసినవారికి గంగాస్నానం చేసిన పుణ్యం లభిస్తుందంటారు.
కార్తీక మాసం చలిరోజులు. కనుక బీదలకు వస్త్రదానం చేస్తే మంచిది. అన్నదానం, ముత్తయిదువలకు ఫలప్రదానం చేయటం, ఆవునేతితో దీపారాధన చేయటం, దేవాలయాల్లో ధ్వజస్తంభాలకు వేలాడదీసిన ఆకాశదీపాలకు నమస్కరించటం, వన భోజనాలు, ఉపవాసాలు- ఇవన్నీ పుణ్యకార్యాలే!
కార్తీక పౌర్ణమి నాడు ముత్తయిదువలు నోచుకొనే నోములు రెండు ఉన్నాయి. ఒకటి: కార్తీక చలిమిళ్ల నోము. పూర్వం ఒక పండితుడి కూతురు, ఒక రాజుగారి కూతురు ఈ నోమును అశ్రద్ధతో నోచి, కుటుంబ కష్టాలకు కారకులైనారు. తరవాత పశ్చాత్తాపాన్ని పొంది, భక్తిశ్రద్ధలతో ఇదే నోము నోచుకొని, సకల సౌభాగ్యాలనూ అనుభవించారు. ఈ నోమును నోచుకొనేవారు అయిదు మానికల (పది కిలోల) బియ్యంతో చలిమిడి చేసి, మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువలకు, ఆపై సంవత్సరం పదిమందికి, తరవాతి సంవత్సరం పదిహేను మందికి వాయనాలనిస్తారు. ఇదే ఈ నోముకు ఉద్యాపన.
రెండోది, కృత్తికాదీపాల నోము. కార్తీక పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం వచ్చిన సంవత్సరం ఈ నోమును ప్రారంభిస్తారు. ఆ రోజు శివాలయంలో నూటఇరవై దీపాలను వెలిగిస్తారు. గణపతి పూజ, శివాభిషేకం చేయించి పురోహితుడికి స్వయంపాకం కోసం ఒక మానెడు సోలెడు- రెండున్నర కిలోల బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, కూరగాయలు మొదలైన భోజన పదార్థాలను ఇస్తారు. మర్నాడు- బహుళ పాడ్యమినాడు పదిమంది పండితులకు భోజనం పెడతారు. తరవాతి సంవత్సరం రెండువందలనలభై దీపాలు, ఆ పై సంవత్సరం మూడువందలఅరవై దీపాలను శివాలయంలోనే వెలిగించి ఈ నోమును నోచుకోవాలి. దీనివలన శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ వచనం.
కార్తీక పౌర్ణమినాడు చేయవలసిన విధి మరొకటి ఉన్నది. ఉదయం ఉసిరిక చెట్టు కింద తులసీ ధాత్రీ సమేతుడైన కార్తీక దామోదరుడిని పూజిస్తారు. మధ్యాహ్నం బంధుమిత్రాదులతో కలిసి వనభోజనాలు చేస్తారు. సాయంకాలం తులసికోటకు పూజచేసి స్కాంద పురాణంలో ఉన్న తత్త్వనిష్ఠోపాఖ్యానాన్ని, శత్రుజిత్తు చరిత్రను, దేవదత్తోపాఖ్యానాన్ని, మందరోపాఖ్యానాన్ని, అంబరీషోపాఖ్యానాన్ని పారాయణం చేస్తారు.
జ్యోతిషశాస్త్ర రీత్యా చంద్రుడు మనః కారకుడు; పౌర్ణమీ తిథికి అధిపతి. చంద్రుడికి ప్రాధాన్యం కలిగిన ఈ కార్తీక పౌర్ణమినాడు ఈ కార్యక్రమాలను నిర్వహించినవారికి మానసికమైన ప్రశాంతత, ఆనందమూ లభిస్తాయంటారు.
- డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

Sunday, June 7, 2009
మృగశిర కార్తె
పరమాత్ముడు తాను సృజించిన జీవరాశుల బాగోగుల గురించే సదా కర్తవ్య నిమగ్నుడై ఉంటాడు. విశ్వగమన క్రియలకు పరమాత్ముడే అధినేత. నక్షత్రాలు, గ్రహాలు రాశులతో కూడిన విశ్వాంతరాళం ఆయన కనుసన్నల్లోనే పరిభ్రమిస్తూ జీవరాశులకు అనుకూలమైన రుతువులకు కారణమవుతోంది. చైత్రం నుంచి ఆషాఢం వరకు వేసవి, శ్రావణం నుంచి కార్తీకం వరకు వర్షకాలం, మార్గశిరం నుంచి ఫాల్గుణ మాసం వరకు శీతకాలం ఏర్పడుతూ ప్రపంచంలోని జీవులకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు పరమాత్ముడు కల్పిస్తూనే ఉన్నాడు.
తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు. అశ్వినితో ప్రారంభమై రేవతీ కార్తెతో ముగిసే కార్తులు మనకు ఇరవై ఏడు ఉన్నాయి. వర్షకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె పూనిననాడు ఆకాశంలో మృగం తలరూపంలో మూడు నక్షత్రాలు ఒక ఆకారంగా ఏర్పడటం కుతూహలం కలిగిస్తుంది. తొలకరితో ప్రారంభమయ్యే వర్షకాలంలో పొలం పనులు నిర్వహించుకోవడానికి అవసరమయ్యే పశు(మృగ) సంపదను సమాయత్తం చేసుకోవడానికి- ఆకాశంలో మృగశిరస్సు రూపంలో దైవం సంకేతాన్ని అందిస్తాడంటారు. కాలానికి అతీతుడైన పరమాత్మ మాస, తిథి, కార్తె, దిన నక్షత్ర గమనాలను నిర్దేశిస్తూ, జీవులకు అవసరమైన ఆహార ఉత్పత్తులకు, ఇతర దైనందిన వ్యాపకాలకూ మార్గదర్శకత్వం వహించడం వూహకందని అలౌకిక వ్యవహారమే!
వర్షకాలంలో ఎడతెరిపి లేని వానలవల్ల మనిషికి కొన్ని రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. నేటికీ పల్లెప్రాంతాల్లో నాన్నమ్మలు, అమ్మమ్మలూ పిల్లలకు ఇంగువ బెల్లం కలిపి మృగశిర కార్తె పూనిన రోజు తినిపించడం ఆచారంగా కొన్ని ప్రాంతాల్లో గమనించవచ్చు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షకాలంలో సోకే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుంది. వర్షకాలంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిరకార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే పూర్వకాలంనాటి వైద్యుడు గ్రంథస్థం చేశాడు.
పూర్వం వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. అందుకే కార్తెలన్నింటిలోనూ మృగశిరకు చాలా ప్రాముఖ్యం ఉంది. అటు పరమాత్మకూ, ఇటు ధరణిపైని లౌకిక వ్యవహారాలకు మృగశిర కార్తె అనుసంధానంగా ఉంటుందన్నది పెద్దలమాట. తొలకరి జల్లుల కారణంగా భూమిపైనుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నింటికీ ఆనందం కలిగిస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్షపు జల్లుల అనంతరం ధరణినుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని అంటాడు. మృగశిర కార్తె, ఆరుద్ర కార్తెల మధ్య వచ్చే యోగినీ ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, కుమారషష్ఠి, వైవస్వత సప్తమి అత్యంత పర్వదినాలు. ఇంటిబయట వరుణదేవుడు వర్షపు జల్లులు కురిపిస్తూ చల్లని గాలులతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారిస్తే మనస్సు కూడా దైవధ్యానానికి ఆత్రుత పడుతుంది. అందుకే వర్షరుతు ప్రారంభాన్ని సూచించే మృగశిర కార్తె నగరవాసులకూ, పల్లెజనాలకూ పర్వదినమే.
- అప్పరుసు రమాకాంతరావు

ఏరువాక పున్నమి
సామాజిక స్వరూపాన్ని నిర్ణయించేది ఆ ప్రజలకు భగవంతునిపై ఉన్న దృక్పథం. ఆది మానవుడికి దేవుడు ప్రాకృతికశక్తి. వ్యవసాయ సంస్కృతి దాకా అదే సాగుతూ వచ్చింది. గణజీవితంలోని ప్రాకృతిక పూజలన్నీ ఆర్యుల చేతిలో సంస్కృతీకరణం చెందుతూ వచ్చాయి.
రైతులు తమకు ఆహారాన్ని ఇచ్చే పంట పొలంలోను, తమతో పాటు క్షేత్రంలో శ్రమించే పశువుల్లోను, వ్యవసాయ ఉపకరణాల్లోను దైవాన్ని సంభావించారు. ఆంధ్రదేశంలో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను కర్షకులు ఏరువాక పున్నమిగా జరుపుకోవడంలో ఈ దృష్టి గోచరిస్తుంది. సేద్యం భారతదేశంలో ప్రధాన జీవనాధారం. దేశ సౌభాగ్యంలో కర్షకులు జరుపుకొనే ఈ ఉత్సవం జనజీవనంలో ఏరువాక పున్నమి గా ప్రాచుర్యం వహించినా, ఇది వైదికోత్సవం కాదు. కొందరు పండితులు దీన్ని కృషి పౌర్ణమిగా పేర్కొన్నారు.
వర్షరుతువు ఆరంభంకాగానే కృషీవలురు క్షేత్రపాలుని సంబోధిస్తూ మంత్రాలు చదువుతుండేవారని రుగ్వేదం చెబుతుంది.
జైమిని న్యాయమాలలో ఉద్వృషభయజ్ఞం పేర్కొన్నారు. ఉత్తర భారతంలో ఆంధ్రుల ఏరువాక పండుగలా ఉద్వృషభయజ్ఞం చేసే సంప్రదాయం ఉండేదని, ఆ రోజు ఎడ్లను పూజించి పరుగెత్తించేవారని తెలుస్తోంది.
విష్ణుపురాణంలో సీతాయజ్ఞం ప్రస్తావన ఉంది. సీత అనే మాటకు నాగేటి చాలు అని అర్థం.
బ్రాహ్మణులకు మంత్రజపమే యజ్ఞం, కర్షకులు సీతాయజ్ఞం చేస్తారు, గోపాలురు గిరి యజ్ఞపరులు అని శ్రీకృష్ణుడు గోప వృద్ధునితో చెప్పినట్లు భాగవత పురాణం పేర్కొంటోంది. బౌద్ధ జాతక కథల్లోని వప్ప మంగలదివస ఏరువాక పండగను పోలినదే. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్ష రుతువు ఆరంభం కాగానే కర్షకులకు లాంఛనంగా ఒక బంగారు నాగలిని అందజేసేవాడని లలితవిస్తరం చెబుతోంది. హాలుని గాథాసప్తశతిలో ఏరువాక పున్నమి ప్రస్తావన ఉంది. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. ఎడ్లకు పొంగలి పెడతారు. సాయంకాలం గ్రామంలోని రైతులంతా మంగళవాద్యాలతో ఊరేగింపుగా పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. ఊరి వాకిట గోగునారతో చేసిన తోరణం కడతారు. దాన్ని చెర్నాకోలలతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు. ఇది పశువులకు మేలు చేస్తుందని నమ్మకం. ఐరోపా దేశాల్లోని మేపోవ్ ఇటువంటి పండుగే.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు

Subscribe to:
Posts (Atom)